లారీ ఢీకొని కాలువలో పడిన కారు.. యువకుడు మృతి

లారీ ఢీకొని కాలువలో పడిన కారు.. యువకుడు మృతి

పుత్తూరు, ఆంధ్రప్రభ: తిరుపతి–చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో పుత్తూరు మండలం తైమాంబపురం గ్రామ పరిధిలోని పిల్లారిపట్టు క్రాస్‌రోడ్ సమీపంలోని కల్వర్టు వద్ద జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం… తిరుపతి నుండి పుత్తూరు వైపు వస్తున్న కారును అదే దిశలో నిర్లక్ష్యంగా నడుపుతున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న రక్షణ గోడను ఢీకొని కాలువలో పడిపోయి పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న యువకుడు ఎం. ధర్మ తేజ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న పూర్ణచంద్ర, పవన్ సాయి, చరణ్ తేజ్ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఎం. కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్‌పై దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply