చిన్న వర్షానికే ప్రభుత్వ కళాశాల గేటు జలమయం
మంథని, ఆంధ్రప్రభ: మంథని ప్రభుత్వ కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద చిన్నపాటి వర్షానికే భారీగా నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. దీంతో ప్రతిరోజూ కళాశాలకు వచ్చే విద్యార్థులు, అధ్యాపకులు, క్రీడాకారులతో పాటు ఉదయం వాకింగ్‌కు వచ్చే వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధాన గేటు వద్ద వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు సరైన పారుదల వ్యవస్థ లేకపోవడంతో ప్రతి వర్షానికీ నీరు నిలిచిపోతోందని స్థానికులు తెలిపారు. బురదలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో విద్యార్థులు జారి పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అలాగే కళాశాల ఆవరణలో చేపట్టిన వాకింగ్ ట్రాక్ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో వాకర్లు, క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు.
కళాశాల ప్రధాన గేటు వద్ద శాశ్వత పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు నిలిచిపోయిన వాకింగ్ ట్రాక్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విద్యార్థులు, స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
