సీపీఎస్ జనజాగరణ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
వికారాబాద్, ఆంధ్రప్రభ: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలనే డిమాండ్‌తో నిర్వహించనున్న ‘సీపీఎస్ జనజాగరణ యాత్ర’ పోస్టర్‌ను గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టీఎస్సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు పట్నం రాఘవేందర్ మాట్లాడుతూ, 2004లో అమల్లోకి వచ్చిన సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు. పదవీ విరమణ అనంతరం సామాజిక భద్రత కల్పించడంలో ఈ విధానం విఫలమైందని, కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జనజాగరణ యాత్రలు నిర్వహిస్తున్నామని, జూలై 19న కొడంగల్, తాండూర్ నియోజకవర్గాల్లో, జూలై 20న వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో యాత్రలు జరుగనున్నాయని తెలిపారు. అనంతరం ఆగస్టు 23న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలోని సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జనజాగరణ యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బాబూసింగ్, కడియాల చంద్రశేఖర్, రాజు, దేవ్యా, టీఎస్సీపీఎస్ఈయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అయూబ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురహరి, జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్, బాధ్యులు శ్రీనివాస్, నరేందర్, రఘునాథ్, ఇఫ్తిఖార్, కృష్ణారెడ్డి, రెహ్మాన్, అలాగే పీఆర్టీయూ, టీఎస్‌యూటీఎఫ్, టీయూటీఎఫ్, ఎస్జీటీయూ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
