చిట్యాల రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం, మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండవచ్చని తెలిపారు. అతను తెలుపు-నలుపు చెక్స్ షర్ట్, నీలం రంగు ప్యాంట్, నలుపు రంగు ఇన్నర్‌వేర్ ధరించి ఉన్నాడు. నడుముకు ఎరుపు రంగు మొలతాడు కట్టుకున్నాడు.
మృతుడి కుడి చేతిపై అశోక చక్రం, చేతి ముద్ర ఆకారంలో పచ్చబొట్లు ఉండగా, కుడి చేతి పిడికిలిపై కూడా మరో పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా ఫిట్స్ లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా మృతి సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
