వారాహీమాత ఆలయ గర్భగుడి నిర్మాణానికి శ్రీకారం
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ: నగరంలోని అమ్మ వెంచర్‌లో నిర్మితమవుతున్న శ్రీ వారాహీమాత ఆలయంలో అత్యంత పవిత్రమైన గర్భగుడి నిర్మాణ పనులకు గురువారం ప్రత్యేక పూజల నడుమ ఘనంగా శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శంకుస్థాపన నిర్వహించి, కృష్ణశిలతో గర్భాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, జిల్లాలో తొలి వారాహీమాత ఆలయ నిర్మాణం అభినందనీయమని అన్నారు. కృష్ణశిలతో ఆలయాన్ని నిర్మించడం విశేషమని పేర్కొంటూ, ఆలయాలు హిందువుల ఐక్యతకు, యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడానికి దోహదపడతాయని చెప్పారు. నిత్యం ఆలయ దర్శనం శ్రేయస్కరమని సూచించారు.
ఆలయ కమిటీ వ్యవస్థాపకులు మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ, గర్భగుడిని సంప్రదాయ శిల్పకళా విధానంలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. దశమి తిథి, ఆషాఢ మాసం ప్రారంభానికి, వారాహి నవరాత్రులకు ముందు ఈ పుణ్యకార్యాన్ని ప్రారంభించడం అత్యంత శుభప్రదమని చెప్పారు. తమిళనాడు నుంచి వచ్చిన నిపుణులైన శిల్పులు నిర్మాణ పనులు చేపట్టారని వెల్లడించారు.
ఆలయ నిర్మాణంలో గర్భగుడి పనులు ప్రారంభం కావడం చారిత్రాత్మక ఘట్టమని, భక్తులు, దాతల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని మంచాల జ్ఞానేందర్ తెలిపారు. భక్తులందరూ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎల్‌వీఆర్ షాపింగ్ మాల్ అధినేత శివప్రసాద్, డి. అశోక్, సాయిప్రసాద్, సుదర్శన్, సంజీవ్, మహేష్, ఆంజనేయులు, జయరాం, వెంకటేశం, శ్రీలక్ష్మి, జ్యోతి, హరిణి, పింకీ, శివరాములు తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
