తెలంగాణ క్రీడారంగానికి కొత్త ఊపు
- గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌కు సీఎం రేవంత్ శ్రీకారం
హైదరాబాద్, వెబ్ డెస్క్: తెలంగాణను దేశంలోనే క్రీడారంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గచ్చిబౌలిలో పలు ప్రతిష్టాత్మక క్రీడా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మౌలిక వసతులు, శిక్షణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా “గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్” ను అధికారికంగా ప్రారంభించిన సీఎం, తెలంగాణ క్రీడారంగానికి ఇది కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అన్నారు. అలాగే “యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU)” లోగోతో పాటు అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.
క్రీడలను గ్రామీణ స్థాయి నుంచి ప్రోత్సహించే లక్ష్యంతో ఫిజికల్ లిటరసీ మిషన్‌ను ప్రారంభించారు. యువ క్రీడాకారులు, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ రంగంలో ఆసక్తి ఉన్న వారికి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ ఫెలోషిప్, పలు అకడమిక్ కోర్సులను కూడా ప్రారంభించారు.
తెలంగాణలో క్రీడలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం, యువతను అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడం, అత్యాధునిక శిక్షణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
