శ్రీకాళహస్తిలో వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం

ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా చిన్నారులకు విద్యారంభం

శ్రీకాళహస్తి ఆలయం, ఆంధ్రప్రభ : శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం భక్తుల విశేష ఆదరణ మధ్య వైభవంగా జరిగింది. విద్యారంభానికి అత్యంత శుభప్రదమైన ఈ కార్యక్రమంలో వందలాది మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొని శ్రీకాళహస్తీశ్వరస్వామి, శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవార్ల దివ్య ఆశీస్సులు పొందారు.

స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి ఆశీర్వదించారు. విద్యను దైవసన్నిధిలో ప్రారంభించడం భారతీయ సంస్కృతిలో గొప్ప సంప్రదాయమని పేర్కొంటూ, ప్రతి చిన్నారి విద్యా ప్రస్థానం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి.కె. వెంకటేశులు మాట్లాడుతూ, ప్రతి ఏడాది నిర్వహించే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి సభ్యులు కె. వైశాలి, కె. నాగరాజు, గోపీనాథ్, లక్ష్మమ్మ, ప్రత్యేక ఆహ్వానితులు శైలజ, ఉప కార్యనిర్వహణాధికారి ఎన్.ఆర్. కృష్ణారెడ్డి, ఏఈవో హేమమాలిని, ఆలయ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు శ్రీహరి, సి. నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వెంకటస్వామి, ప్రోటోకాల్ ఏఈవో లోకేష్ బాబు, అనుబంధ ఆలయాల ఛైర్మన్లు, బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు దేవస్థానం కల్పించిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, చిన్నారులకు దైవసన్నిధిలో అక్షరాభ్యాసం నిర్వహించే అవకాశం కల్పించిన దేవస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు.