ముఖ్యమంత్రి హామీల అమలుకు వేగం పెంచాలి..
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలి
నియోజకవర్గాల వారీగా ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై సమగ్ర సమీక్ష
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి – ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్
ఆంధ్రప్రభ విజయవాడ : ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఎలాంటి జాప్యానికి తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో గురువారం ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన నిర్వహించిన ముఖ్యమంత్రి హామీల అమలుపై నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి ప్రకటించిన హామీల అమలుపై సమగ్రంగా సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ప్రధానంగా మూడు ఆర్థిక, మూడు ఆర్థికేతర అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని వాటి పురోగతిని పరిశీలించినట్లు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. తిరువూరు నియోజకవర్గంలో కట్టలేరు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ట్రైబల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను సమీక్షించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్, 150 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మాణంపై సమీక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జీజేసీ కళాశాలను డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడం, హోల్‌సేల్ ఫిష్ మార్కెట్ నిర్మాణం, డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు అంశాలపై చర్చించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రామకృష్ణనగర్ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం, కొత్త అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.
మైలవరం నియోజకవర్గంలో ముత్యాలంపాడు బ్రిడ్జి నిర్మాణం, జక్కంపూడి ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.నందిగామ నియోజకవర్గంలో గొట్టుముక్కల వద్ద మూడు వంతెనల నిర్మాణం, లక్ష్మయ్య వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పోలంపల్లి ప్రాజెక్టు మరమ్మతులు, జగ్గయ్యపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసే అంశాలను పరిశీలించారు.
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, పార్కుల అభివృద్ధి, బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన సాంకేతిక, పరిపాలనా అనుమతులను త్వరితగతిన పూర్తి చేసి, నిధుల ప్రతిపాదనలను ఆలస్యం లేకుండా సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి హామీల అమలే ప్రభుత్వ ప్రాధాన్యత అని, ప్రజల అంచనాలకు అనుగుణంగా ప్రతి పనిని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశా, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
