గడువులోగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పూర్తి చేస్తాం: కలెక్టర్ వెంకటేశ్వర్

73.4 శాతం ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ పూర్తి.. మిగిలిన పనులకు ప్రత్యేక కార్యాచరణ

తిరుపతి, ఆంధ్రప్రభ: భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని జూలై 12 నాటికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.

గురువారం సాయంత్రం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో భారత ఎన్నికల సంఘం సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ అధ్యక్షతన, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమక్షంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పురోగతిని వివరించారు.

జిల్లాలో ఇప్పటివరకు 73.4 శాతం ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. గైర్హాజరైన, ఇతర ప్రాంతాలకు మారిన, మరణించిన ఓటర్లకు సంబంధించిన ఏఎస్‌డీ జాబితా పరిశీలనలో 4.42 శాతం పని పూర్తయిందన్నారు. మరో 7 నుంచి 8 శాతం వరకు ఏఎస్‌డీ నమోదులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మిగిలిన ఫారాల సేకరణతో పాటు ఏఎస్‌డీ వివరాల గుర్తింపు, డిజిటలైజేషన్, ఆన్‌లైన్ అప్‌లోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. మిగిలిన సుమారు 8 శాతం పనిని పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు.

80 శాతం కంటే తక్కువ పురోగతి నమోదైన బూత్‌లకు అదనంగా ఇద్దరు నుంచి ముగ్గురు అధికారులను నియమించినట్లు వెల్లడించారు. ఉదయం బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఫారాల సేకరణ చేపడుతుండగా, సాయంత్రం ప్రత్యేక బృందాలు ఫారాల పరిశీలన, డిజిటలైజేషన్, ఆన్‌లైన్ అప్‌లోడింగ్ పనులను వేగవంతం చేస్తున్నాయని వివరించారు.

జిల్లా యంత్రాంగం, ఎన్నికల విభాగం అధికారులు, బూత్ లెవల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నందున జూలై 12 నాటికి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి, అనంతరం తుది ధృవీకరణ, సమీక్ష ప్రక్రియలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీఎస్‌పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాండ్, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.