గ్రామాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికతో కృషి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ: గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి సర్పంచ్‌లు స్థానిక అవసరాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు.గురువారం క్యాతనపల్లి మండల పరిధిలోని అమ్మ గార్డెన్స్‌లో గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ సి ఈ ఓ గణపతి పాల్గొన్నారు.

గ్రామ స్థాయిలో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల భాగస్వామ్యం తప్పనిసరి అని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాల్లోని సమస్యలను అందుబాటులో ఉన్న వనరులతోనేపరిష్కరించాలని సూచించారు. 15వ, 16వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులు, పన్నుల ఆదాయం, వి బి జె, రాంజీ పథకంనిధులనుసమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు. నిధుల దుర్వినియోగానికిపాల్పడితే సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామాల్లో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జంతు పునరుత్పత్తి నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పశువైద్య శాఖ ద్వారా ఉచితశస్త్రచికిత్సలు, యాంటీ రేబిస్ టీకాలు అందించనున్నట్లుచెప్పారు. మురుగునీటి వ్యవస్థలు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ హాళ్లు, త్రాగునీటి సరఫరా, సౌర విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పనులకు ప్రభుత్వ పథకాల్లో ప్రత్యేక నిధులు ఉన్నాయని, వాటి మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

ఉపాధి హామీ, వీబీజే రాంజీ పథకాల కింద చేపట్టిన పనులకు చెల్లింపులు నిర్ణీత గడువులో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, పనులు పూర్తయిన వెంటనే బిల్లులు, యు, సి,లు సమర్పించాలనిఆదేశించారు.5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు కూరగాయల సాగుకు పందిళ్ల ఏర్పాటు, బి.టి, రోడ్లు, మ్యాజిక్ డ్రైన్లు, సౌర విద్యుత్ వీధి దీపాల వంటి పనులను గ్రామాల్లో చేపట్టే అవకాశం ఉందని వివరించారు. గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి అవసరమైన భూమి, అనుమతులు జిల్లా యంత్రాంగం అందిస్తుందని హామీ ఇచ్చారు.అభివృద్ధి కార్యక్రమాల్లో సర్పంచ్‌లు చొరవ చూపాలని కలెక్టర్ కోరారు.