గోదావరి వరదలపై ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలి: కలెక్టర్ వెట్రి సెల్వి
ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించాలి..
మూడు నెలల నిత్యావసరాలు సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశం
ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ: రానున్న వర్షాకాలంలో గోదావరి నదికి వచ్చే వరదల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ నుంచి గోదావరి వరదల సన్నద్ధత, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, జీఎస్టీ వసూళ్లు, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రగతి తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై నుంచి అక్టోబర్ వరకు తుఫానులు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత శాఖలు పటిష్ట కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వరదలతో కాల్వలు, చెరువులు, ఏర్లకు గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి బలోపేతం చేయాలని ఆదేశించారు.
గోదావరి వరదల సమయంలో మొదటి, రెండో, మూడో హెచ్చరికల దశల్లో ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. ఆయా గ్రామాల్లో మూడు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను ముందుగానే నిల్వ ఉంచాలని సూచించారు. వరదల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే బోట్లు, ఈతగాళ్లను ముందుగానే సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షిస్తూ ఈ నెల 13న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. హెలిప్యాడ్తో పాటు గ్యాప్-1, గ్యాప్-2, డయాఫ్రం వాల్ తదితర నిర్మాణ ప్రాంతాల్లో పనుల పురోగతిని ఇంజినీరింగ్ అధికారులు వివరించాలని, ఆయా ప్రాంతాలకు జిల్లా స్థాయి అధికారులను ఇన్చార్జ్లుగా నియమించాలని ఆదేశించారు.
జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణ, కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులపై జీఎస్టీ వసూళ్లను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని తెలిపారు. రహదారులు, భవనాలు, హౌసింగ్, వైద్య ఆరోగ్య, విద్య, సమగ్ర శిక్ష, జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ తదితర శాఖలు కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులు, జీఎస్టీ తగ్గింపు వివరాలను వాణిజ్య పన్నుల శాఖకు అందజేయాలని సూచించారు.
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రగతిపై సమీక్షిస్తూ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను శుక్రవారం నాటికి 85 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. లక్ష్యాల సాధనలో వెనుకబడిన అధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇన్చార్జ్ డీఆర్వో దేవకీదేవి, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు, జిల్లా పరిషత్ సీపీఓ జగదాంబ, డీపీఓ మల్లికార్జునరావు, ఆర్డీవోలు లక్ష్మీప్రసన్న, రమణ, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్రబాబు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ట్రాన్స్కో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
