బాలలపై లైంగిక వేధింపులను అరికడదాం – ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్
- వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం
- ‘మిషన్ వాత్సల్య’ కరపత్రాల ఆవిష్కరణ
నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ: బాలలపై లైంగిక వేధింపులను అరికట్టి వారికి సురక్షిత బాల్యాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఐపీఎస్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ, షీ టీమ్స్, భరోసా కేంద్రం, బాలల సంక్షేమ శాఖ, కార్మిక శాఖ తదితర విభాగాల అధికారులతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నివారణ, బాలల భద్రత, సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. బాలల రక్షణ కోసం అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని ఎస్పీ సూచించారు. అనంతరం మిషన్ వాత్సల్య పథకం కింద జిల్లా బాలల పరిరక్షణ విభాగం రూపొందించిన అవగాహన కరపత్రాలను ఎస్పీ విడుదల చేశారు. అత్యవసర పరిస్థితులు లేదా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి అనే అంశాలను పోస్టర్లో సరళంగా వివరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్, సీసీఎస్ సీఐ శంకర్, డీసీఆర్బీ ఎస్ఐ రమేష్, భరోసా ఎస్ఐ రజితతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
