ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకోవాలి:
మంత్రి అచ్చెన్నాయుడు
వంశధార నుంచి 2 వేల క్యూసెక్కుల నీటి విడుదల.. చెరువులు వెంటనే నింపుకోవాలని రైతులకు సూచన
శ్రీకాకుళం బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వంశధార ప్రాజెక్టు నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువులను తక్షణమే నింపుకోవాలని రైతులకు సూచించారు.
సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతి ఎకరానికి నీరు అందేలా ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులతో రైతులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని కోరారు.
నీటి వృథాను అరికట్టి, అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా, సమర్థంగా వినియోగించుకుని ప్రస్తుత ఖరీఫ్ పంట సీజన్‌ను విజయవంతం చేయాలని జిల్లా రైతాంగానికి మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
