Clean-Chit : డిపాజిటర్ల నమ్మకం Andhra Prabha News

Clean-Chit : డిపాజిటర్ల నమ్మకం Andhra Prabha News

  • గాంధీ అర్బన్​ బ్యాంకు సొంతం
  • అందుకే క్లీ.న్​చీట్​
  • రూ.698 కోట్ల డిపాజిట్లు
  • రూ. 525 కోట్ల రుణాలు
  • రూ.9 కోట్ల నికర లాభం..
  • సభ్యులకు 10 శాతం డివిడెండ్ పంపిణీ…
  • డిపాజిట్ దారులకు అత్యధిక వడ్డీ..
  • రుణగ్రస్తులకు అత్యల్ప వడ్డీ…
  • నూజివీడు, హనుమాన్ జంక్షన్‌లో కొత్త భవనాలు..
  • పటమటలో అత్యాధునిక కేంద్ర కార్యాలయానికి శ్రీకారం..
  • గాంధీ కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు…

( ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ )

శతాబ్ది ప్రస్థానంలోకి అడుగుపెడుతున్న గాంధీ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆర్థికంగా మరింత పటిష్ఠంగా ఎదుగుతూ సహకార బ్యాంకింగ్ రంగంలో విశ్వసనీయ సంస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. బ్యాంకుపై ఇటీవల కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, సహకార శాఖతో పాటు సంబంధిత అధికారులు పలుమార్లు విచారణ జరిపి ఎలాంటి అక్రమాలు, అవకతవకలు లేవని స్పష్టంగా నిర్ధారించినప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బ్యాంకు పాలకవర్గ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

Clean-Chit : దశాబ్దాల చరిత్ర…

1928లో స్థాపితమైన గాంధీ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ త్వరలోనే శతాబ్ది సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా సంస్థ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. 2022లో తాను చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలకవర్గం, ఉద్యోగులు, సీఈఓ పద్మిని, సీఓఓ శివ ప్రసాద్ సమిష్టి కృషితో బ్యాంకు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా నూజివీడు, హనుమాన్ జంక్షన్ శాఖలను నూతన భవనంలోకి మార్చిన సందర్భంగా ఈ నెల 10న నూజివీడులో మరియు ఈ నెల 17న హనుమాన్ జంక్షన్ లో ఖాతాదారుల సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విజయవాడ పటమటలో 1,440 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ అత్యాధునిక సదుపాయాలతో కూడిన కేంద్ర కార్యాలయం, శాఖ భవనం నిర్మాణానికి త్వరలోనే శ్రీకారం చుడతామని వెల్లడించారు.

Clean-Chit : నిరాధారణ ఆరోపణలు

బ్యాంకుపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఒక రుణగ్రహీత కుటుంబానికి చెందిన వ్యవహారంలో సహకార శాఖ నిబంధనల మేరకే వేలం నిర్వహించామని రూ 63 లక్షల 60 వేల రూపాయలకు విక్రమ్ కాగా, బ్యాంకు బకాయిలు 33 లక్షల 94 వేల 173 రూపాయలను మినహాయించిన అనంతరం మిగిలిన మొత్తాన్ని రూ 29,65.827 ను కుటుంబ వివాదాల కారణంగా సస్పెన్స్ ఖాతాలో ఉంచినట్లు వివరించారు. అనంతరం సహకార శాఖ సూచనల ప్రకారం వారసులకు వాటాల వారీగా చెల్లింపులు కూడా చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై సహకార శాఖ, జిల్లా అధికారులు అన్ని రికార్డులు పరిశీలించి ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చినా, కొందరు కావాలనే బ్యాంకు ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Clean-Chit : ఆర్థిక క్రమశిక్షణ లో బ్యాంకు…

ప్రస్తుతం బ్యాంకులో సుమారు రూ.698 కోట్ల డిపాజిట్లు, రూ.525 కోట్ల రుణాలు ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.9 కోట్ల నికర లాభం నమోదు చేసినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన మహాజన సభలో సభ్యులకు 10 శాతం డివిడెండ్ ప్రకటించి పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

Clean-Chit : ప్రైవేట్ బ్యాంకులకు దీటుగా సేవలు…

ప్రైవేట్ బ్యాంకులకు పోటీగా డిజిటల్ సేవలను విస్తరిస్తూ మొబైల్ బ్యాంకింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, గతంలో గోల్డ్, మార్ట్గేజ్ రుణాలకు మాత్రమే పరిమితమైన సేవలను ప్రస్తుతం గృహ కొనుగోలు, గృహ నిర్మాణ, ఓవర్‌డ్రాఫ్ట్ వంటి పలు రుణ సదుపాయాలకు విస్తరించామని చెప్పారు. గతంలో రూ.50 లక్షల వరకు మాత్రమే రుణాలు మంజూరు చేసేవారమని, ప్రస్తుతం అర్హత కలిగిన ఖాతాదారులకు రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు కూడా రుణాలు అందిస్తున్నామని వివరించారు. బ్యాంకు నిరర్థక ఆస్తులను (ఎన్ఎన్‌పీఏ) పూర్తిగా నియంత్రించి సున్నా శాతానికి తీసుకొచ్చామని, ఆర్బీఐ, సహకార శాఖ మార్గదర్శకాల మేరకు క్రమశిక్షణతో రుణాల నిర్వహణ చేపట్టడం వల్ల ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. విజయవాడలో శతాబ్ద కాలం చరిత్ర కలిగిన మరో సహకార బ్యాంకు తప్పుడు ప్రచారాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తూ, అదే పరిస్థితి గాంధీ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు తలెత్తకుండా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. బ్యాంకుకు సంబంధించిన ఏ ఫిర్యాదు లేదా ఆరోపణ వచ్చినా ముందుగా యాజమాన్యాన్ని సంప్రదించి వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే వార్తలు ప్రచురించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల విశ్వాసమే బ్యాంకుకు అతిపెద్ద ఆస్తి అని, దానిని కాపాడేందుకు యాజమాన్యం పూర్తిస్థాయి పారదర్శకతతో పనిచేస్తోందని వేమూరి వెంకట్రావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాలకవర్గ సీనియర్ సభ్యులు అన్సారీ, సగ్గుర్తి నాగేశ్వరరావు, భోగాది మురళి, ఆంజనేయ రాజు, వెంకటరమయ్య, రఘురామ్, పట్టాభి, రాజశేఖర్, సుభాష్, సీఈఓ పద్మిని, సీఓఓ శివ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.