ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు ఖండించిన పల్లె రఘునాథ్ రెడ్డి, సింధూర రెడ్డి
వ్యక్తిగత విమర్శలు రాజకీయ విలువలను దిగజారుస్తాయన్న మాజీ మంత్రి
అనంతపురం, ఆంధ్రప్రభ: మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు నివాసానికి పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేసిన ఆరోపణలను, అలాగే మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ, రాజకీయాల్లో నైతిక విలువలు, హుందాతనం ఎంతో అవసరమన్నారు. వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యల వల్ల రాజకీయ నాయకులపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలకు గొప్ప చరిత్ర ఉందని, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, జేసీ నాగిరెడ్డి వంటి ప్రముఖులు రాజకీయ విలువలను కాపాడుతూ ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు. అలాంటి జిల్లాలో వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.
అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాల సంస్కృతి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పెరిగిందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడిని అప్పటి ప్రభుత్వం అక్రమంగా 53 రోజుల పాటు జైలులో ఉంచిందని విమర్శించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, గత ప్రభుత్వ హయాంలో రౌడీయిజం, ఫ్యాక్షన్ రాజకీయాలు, గంజాయి సంస్కృతి పెరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో అల్లర్లు, అలజడులు సృష్టించే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదన్నారు. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి రాజీ పడరని స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఎస్. రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదన్నారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయ విలువలను దెబ్బతీసేలా నీచమైన భాషను ఉపయోగించడం భావితరాలకు మంచిది కాదని పేర్కొన్న ఆయన, ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం వైఎస్సార్సీపీ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు ఖండించిన పల్లె రఘునాథ్ రెడ్డి, సింధూర రెడ్డి
