Maharashtra Floods | వరద బీభత్సం.. నీటిలో మునిగిన హెచ్‌పీసీఎల్ ప్లాంట్
Maharashtra Floods | వరద బీభత్సం.. నీటిలో మునిగిన హెచ్‌పీసీఎల్ ప్లాంట్
Maharashtra Floods | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారీగా వర్షాలు, వరదలు వచ్చినప్పుడు చెట్లు, చేపలు కొట్టుకువచ్చిన సంఘటనలు అనేకం చూశాం. కానీ, ఏకంగా వేలాది గ్యాస్ సిలిండర్లు కొట్టుకువచ్చే వరదను ఇప్పుడే చూస్తున్నాం.. ఈ సంఘటన మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో కనిపించింది. వివరాల్లోకి వెళితే.. భారీ వర్షాలు సృష్టించిన విధ్వంసంతో రాయ్‌గఢ్ జిల్లాలోని హెచ్‌పీసీఎల్ పాతాళగంగ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో ప్లాంట్‌లో నిల్వ ఉంచిన సుమారు 3,000 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. నదిలో కొట్టుకువస్తున్న సిలిండర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని, వాటిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించవద్దని జిల్లా యంత్రాంగం ప్రజలను హెచ్చరించింది. ఈ ఘటనతో నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్త పరిస్థితులు నెలకొన్నాయి.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాతాళగంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది సమీపంలోని హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్‌లోకి భారీగా వరద నీరు చేరింది. నీటి ఉద్ధృతి కారణంగా ప్లాంట్‌లో నిల్వ ఉంచిన వేలాది గ్యాస్ సిలిండర్లు ప్రవాహంలో కొట్టుకుపోయి నదిలో తేలుతూ వెళ్లాయి. ఈ దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో మరిన్ని ప్రాంతాలకు సిలిండర్లు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ కిషన్ జవాలే.. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చే గ్యాస్ సిలిండర్లు అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఆసక్తితో వాటిని తాకడం, ఇంటికి తీసుకెళ్లడం లేదా తెరవడానికి ప్రయత్నించడం ప్రాణాపాయానికి దారితీసే అవకాశముందని హెచ్చరించారు. ఎక్కడైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే సమీప పోలీసు స్టేషన్ లేదా జిల్లా అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
ఇప్పటికే జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక శాఖ, హెచ్‌పీసీఎల్ అధికారులు సంయుక్తంగా నదీ తీర ప్రాంతాల్లో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి సురక్షితంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, వదంతులను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
