షార్ట్ సర్క్యూట్‌తో లారీ దగ్ధం.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

అచ్చుతాపురం (ఆంధ్రప్రభ): అచ్చుతాపురం మండలం మార్టూరు రహదారిపై గురువారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం సుమారు 4:40 గంటల సమయంలో AP 31 TF 6381 నంబర్ గల లారీ మార్టూరు రోడ్డులో వెళ్తుండగా క్యాబిన్ భాగం నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ లారీని రోడ్డుపక్కన నిలిపివేసి కిందకు దూకడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అనంతరం మంటలు లారీ మొత్తం వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.