మంత్రి శ్రీధర్‌బాబుపై ఆరోపణలు మానుకోవాలి
- పుట్ట మధుకర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
- అభివృద్ధికి సహకరించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు
- డిసీసీ అధ్యక్షులు బట్టు కరుణాకర్
ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబుపై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, రాజకీయ ప్రయోజనాల కోసమే అసత్య ప్రచారం చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేయడం మానుకోవాలని, అభివృద్ధిని ఓర్వలేకే బీఆర్‌ఎస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్ దండు రమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మాజీ ఎంపీపీ పంథకానీ సమ్మయ్యతో కలిసి ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా బట్టు కరుణాకర్ మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాంత అభివృద్ధికి మంత్రి శ్రీధర్‌బాబు దూరదృష్టితో కృషి చేస్తున్నారని, ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేక పుట్ట మధుకర్ నిరాధార ఆరోపణలకు పాల్పడుతున్నారని విమర్శించారు. శ్రీధర్‌బాబు స్వగ్రామంలో గ్రామ దేవత ఎల్లమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా తన తండ్రి పేరు మీద గ్రామంలోని ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తే, వాటిని పుష్కరాల చీరలుగా చిత్రీకరించడం అత్యంత నీచమైన రాజకీయ సంస్కృతి అని అన్నారు. అలాగే, పుట్ట లింగమ్మ ట్రస్ట్ పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై కూడా మాజీ ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకుని జిల్లా అభివృద్ధికి సహకరించాలని, లేనిపక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు దేవన్, నాయకులు వెంపటి భువన సుందర్, వెంకీ యాదవ్ ,శ్రీనివాస్, మహేష్ , మట్టవాడ సురేష్, కౌన్సిలర్లు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
