ఎన్యూమరేషన్ గడువును ఆగస్టు 30 వరకు పొడిగించాలి
సీపీఎం
మోత్కూర్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఎన్యూమరేషన్ గడువును ఆగస్టు 30 వరకు పొడిగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి కోరారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన బీఎల్‌ఏల సమావేశంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు. అనంతరం బొల్లు యాదగిరి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో ప్రజలు ఎన్యూమరేషన్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని అన్నారు.
2002 ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చాలామందికి స్పష్టత లేదని, పాత ఓటరు సంఖ్య, సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ వివరాలు తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి పూర్తి వివరాలు తెలియజేయకుండా కేవలం దరఖాస్తు ఫారాలు మాత్రమే అందిస్తున్నారని, దీంతో నిరక్షరాస్యులు, అవగాహన లేని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ గడువును మరో నెలపాటు పొడిగించి ఆగస్టు 30 వరకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, పట్టణ కార్యదర్శి రాచకొండ రాములమ్మ, మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, పానుగుల రమేష్, గుండు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
