ICAR | చిత్తూరు తోతాపురి రైతుల కోసం కేంద్రం ప్రత్యేక కమిటీ..

ఐదేళ్ల సంక్షోభానికి శాశ్వత పరిష్కారంపై దృష్టి

ICAR | చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా తోతాపురి మామిడి రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కీలక పరిణామం చోటుచేసుకుంది. వరుసగా ఐదేళ్లుగా ధరల పతనం, పెరిగిన సాగు వ్యయం, ప్రకృతి వైపరీత్యాలు, ఎగుమతుల మందగమనం, ప్రాసెసింగ్ పరిశ్రమల కొనుగోళ్లలో తగ్గుదల వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, తోతాపురి ధరలను స్థిరీకరించడం, సాగు నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు మొత్తం విలువ వ్యవస్థను అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారాలు సూచించడం కమిటీ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి తోతాపురి రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. పెట్టుబడులు పెరిగినా గిట్టుబాటు ధరలు లభించడం లేదని రైతులు వివరించడంతో వెంటనే శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని ఆదేశించారు.

దీంతో లక్నోలోని ఐసీఏఆర్–సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ డాక్టర్ టి. దామోదరన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డాక్టర్ ఎం. శంకరన్, డాక్టర్ హెచ్.ఎస్. సింగ్, డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఉద్యానవన శాఖ ప్రతినిధి సభ్యులుగా ఉన్నారు. రాబోయే పది రోజుల్లో ఈ బృందం ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు తోతాపురి సాగు అధికంగా ఉన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టనుంది.

2.80 లక్షల ఎకరాల్లో తోతాపురి సాగు..

దేశంలోనే తోతాపురి మామిడి సాగుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. జిల్లాలో సుమారు 2.80 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుండగా, అందులో దాదాపు 90 శాతం తోతాపురి రకమే ఉంది. ప్రతి ఏడాది సుమారు 7.50 లక్షల టన్నుల దిగుబడి లభిస్తోంది. రాష్ట్రంలోని మామిడి గుజ్జు పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకులో అత్యధిక భాగం చిత్తూరు నుంచే సరఫరా అవుతోంది.

టన్ను ధర రూ.30 వేల నుంచి రూ.4 వేలకే..

ఒకప్పుడు టన్నుకు రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు పలికిన తోతాపురి ధర ఈ సీజన్‌లో కొన్ని ప్రాంతాల్లో రూ.4 వేలకే పరిమితమైంది. కోత ఖర్చు కూడా రాకపోవడంతో రైతులు పండ్లను చెట్లపైనే వదిలేయడం, రోడ్ల పక్కన పారబోయడం వంటి ఘటనలు పలమనేరు, బైరెడ్డిపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో కనిపించాయి.

సమగ్ర అధ్యయనంతో నివేదిక..

రైతుల పెట్టుబడి వ్యయం, దిగుబడులు, ఆదాయాలు, ప్రాసెసింగ్ పరిశ్రమల సామర్థ్యం, దేశీయ మార్కెట్ పరిస్థితులు, ఎగుమతుల అవకాశాలు, డిమాండ్–సరఫరా పరిస్థితులు, మార్కెటింగ్ వ్యవస్థలోని లోపాలపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయనుంది. అలాగే గిట్టుబాటు ధర, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహం, శీతల గిడ్డంగులు, ఎఫ్‌పీవోల బలోపేతం, మార్కెటింగ్ సంస్కరణలు, ప్రాసెసింగ్ పరిశ్రమల ఆధునీకరణ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

ఈ నివేదిక ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణ రూపొందించి తోతాపురి మామిడి రంగానికి దీర్ఘకాలిక రక్షణ కల్పించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. కమిటీ సిఫార్సుల అమలుతో గిట్టుబాటు ధరలు, ఎగుమతుల విస్తరణ, ప్రాసెసింగ్ పరిశ్రమల బలోపేతం, పెట్టుబడుల పెరుగుదల, ఉపాధి అవకాశాల సృష్టికి మార్గం సుగమం అవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.