విద్యుత్ శాఖ పనుల జాప్యంపై ఎంపీ ఆగ్రహం

ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలి: ఎంపీ మహేష్ యాదవ్

ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో ఆర్డీఎస్ఎస్ (రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) పనులు నత్తనడకన సాగుతున్న తీరుపై ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు పలుమార్లు సంప్రదించినా కాంట్రాక్టు సంస్థలు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ఆర్డీఎస్ఎస్ సమీక్ష సమావేశంలో ఎంపీ మహేష్ యాదవ్‌తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఆర్డీఎస్ఎస్ ప్రధాన లక్ష్యం స్మార్ట్ మీటరింగ్ వంటి డిజిటల్ సాంకేతికత ద్వారా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడంతో పాటు పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడం, సాంకేతిక-వాణిజ్య నష్టాలను తగ్గించి డిస్కమ్‌లకు ఆర్థిక స్థిరత్వం కల్పించడమేనని తెలిపారు.

ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఫీడర్ల అభివృద్ధి పనులు అనేక ప్రాంతాల్లో ఆలస్యంగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్టు సంస్థలు పనులను వేగవంతం చేయాలని, ప్రజాప్రతినిధులతో సమన్వయం పాటించాలని సూచించారు.

ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మూడు ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. పాత ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు.

కోకో, కొబ్బరి, పామాయిల్ వంటి ఉద్యాన పంటలు అధికంగా సాగు చేసే ఏలూరు జిల్లాలో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అత్యంత అవసరమని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఉన్న సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించాలని సూచించారు.

సమావేశం సందర్భంగా ఏపీఈపీడీసీఎల్ సీఎండీతో ఫోన్‌లో మాట్లాడిన ఎంపీ మహేష్ యాదవ్, జిల్లాలో కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారం, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో దెందులూరు, చింతలపూడి, ఉంగుటూరు ఎమ్మెల్యేలు, ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ టి. వనజ, సీఎజీఎం బి. అశోక్ కుమార్, జీఎం డేవిడ్, ఎస్‌ఈ అంబేద్కర్, ఇతర అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.