ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్‌కు విశేష స్పందన
భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది.. ఎమ్మెల్యే సుజన చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ,టీడీపీ రాష్ట్ర నాయకులు గుర్రంకొండ, టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ ధనేకుల వెంకట సుబ్బారావు,ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, మాజీ కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు తో కలిసి వినతులు స్వీకరించారు..
భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. 46 వ డివిజన్, లంబాడి పేట కొండ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 32 కుటుంబాల ప్రజలు తమకు ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల సమయంలో కొండ చరియలు విరిగిపడటం, పిచ్చింగ్ లు కూలి నివాస సముదాయాలు దెబ్బతింటున్నాయన్నారు..
తమకు కూటమి ప్రభుత్వం ఇళ్లను కేటాయించాలన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్తామని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుర్రం కొండ తెలిపారు. వీఆర్వో తో మాట్లాడి వారి వివరాలను నమోదు చేశారు. ప్రజలు తమ వినతులను రేషన్ కార్డులు పింఛన్లు, తాగునీరు, ఇళ్లస్థలాలు, వైద్య సహాయం వంటి తదితర సమస్యలపై దరఖాస్తు రూపంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ధనాల శ్రీనివాసరావు, షేక్ కరిముల్లా, దాసరి బుజ్జి తదితరులు పాల్గొన్నారు..
