మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
గాంధీ విగ్రహం ఎదుట మామిడి రైతు సంఘం శాంతియుత నిరసన
చిత్తూరు ఆంధ్రప్రభ బ్యూరో: మామిడి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో రైతులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని సమర్పించి నిరసన తెలిపారు.
మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సి. మునీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మామిడి రైతుల సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆచరణాత్మక చర్యలు కనిపించలేదని విమర్శించారు. రైతులను ఆదుకుంటామని రాజకీయ పార్టీలు ప్రకటించినా ఆ హామీలు అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ప్రకటించిన 8+4 ధర విధానంలో ప్రభుత్వం తన వాటాగా కిలోకు రూ.4 రైతుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ, గుజ్జు పరిశ్రమలు, మండీలు, ర్యాంపులు చెల్లించాల్సిన రూ.8 ఇవ్వలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు అమలు చేయించలేకపోయారని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక్క గుజ్జు పరిశ్రమ కూడా పూర్తి ధర చెల్లించలేదన్నారు.
ఈ ఏడాది ప్రభుత్వం కిలోకు రూ.4 ప్రోత్సాహకాన్ని ప్రకటించడం స్వాగతించదగ్గ విషయమేనని పేర్కొంటూ, జిల్లా కలెక్టర్ ప్రకటించిన కిలోకు రూ.7.50 ధర రైతులకు అందేలా పర్యవేక్షించడంలో యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.17.47ను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు మురళి మాట్లాడుతూ జిల్లాలోని గుజ్జు పరిశ్రమలు రాజకీయ మద్దతుతో నడుస్తున్నాయని, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో ముందుకు రావడం లేదని ఆరోపించారు. రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోవడం తప్ప రైతుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. మామిడి రైతుల కష్టంతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా వారికి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మామిడి రైతు సంఘం రైతులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
జిల్లా ఉపాధ్యక్షురాలు పి. హేమలత మాట్లాడుతూ ర్యాంపులను ఒక్కసారిగా మూసివేయడం సమంజసం కాదన్నారు. పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోయాలని, చివరి కాయ వరకు కొనుగోలు చేస్తామని అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. పంట పూర్తయ్యేంత వరకు ర్యాంపులు, మండీలు, గుజ్జు పరిశ్రమలు కొనుగోళ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
జిల్లా ఉపాధ్యక్షుడు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ రైతుల సంక్షేమం పేరుతో కొందరు వ్యాపారవేత్తలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో ఉపాధ్యక్షుడు మునిరత్నం నాయుడు మాట్లాడుతూ ఏడాదిగా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ గుజ్జు పరిశ్రమల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని, రైతుల సమస్యలపై అధికారులు సరైన చర్చ కూడా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు.
జిల్లా నాయకులు మోహన్‌రెడ్డి, సందీప్, ఉమాపతి రెడ్డి, త్యాగరాజుల రెడ్డి, జయదేవయ్య, చంగల్ రాయిరెడ్డి మామిడి రైతుల డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. మామిడి రైతు సంఘం మాజీ అధ్యక్షుడు జనార్ధన్, రాష్ట్ర నాయకుడు రామానాయుడు సంఘీభావం ప్రకటించారు. వెంకట్‌రెడ్డి, పుణ్యసముద్రం రవిప్రసాద్‌తో పాటు జిల్లా నలుమూలల నుంచి 150 మందికిపైగా మామిడి రైతులు పాల్గొన్నారు.
మామిడి రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి గిట్టుబాటు ధర, కొనుగోలు హామీ కల్పించాలని, ప్రభుత్వ నిర్ణయాల అమలుపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని మామిడి రైతు సంఘం నాయకులు హెచ్చరించారు.
