మార్కెట్లలో చెత్తకు చెక్..
మార్కెట్లలో చెత్తకు చెక్..
పరిశుభ్రతపై కమిషనర్ శారదాదేవి సీరియస్!
కూరగాయల మార్కెట్లలో పారిశుధ్యానికి ప్రాధాన్యం..
జయనగర్ కాలువల మరమ్మతులకు ఆదేశాలు
తిరుపతి, ఆంధ్రప్రభ: నగరంలోని కూరగాయల మార్కెట్లను మరింత పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) శారదాదేవి అధికారులకు, మార్కెట్ నిర్వాహకులకు సూచించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జయనగర్, పరసాల వీధి, చింతకాయల వీధి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా జయనగర్ కాలనీలో కాలువలు దెబ్బతిన్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. నగరంలో ఎక్కడా చెత్తకుప్పలు పేరుకుపోకుండా పారిశుధ్య సిబ్బంది నిరంతరం చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రామచంద్ర పుష్కరిణి పరిసర ప్రాంతాల్లో చెత్త వేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం పరసాల వీధిలోని కూరగాయల మార్కెట్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వ్యాపారులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. రాత్రి వేళల్లో కొందరు అనుమానితులు ప్రహరీ గోడ దూకి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారని, భద్రతా పరంగా ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని కోరారు.
మార్కెట్‌కు ప్రతిరోజూ అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నందున చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగించాలని మార్కెట్ నిర్వాహకులను కమిషనర్ ఆదేశించారు. స్థానికులు, వ్యాపారులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, డీఈలు మధు, లలిత, శానిటేషన్ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
