Political tension | ‘నిరూపిస్తే రాజీనామా’.. అఖిలప్రియ సవాల్

Political tension | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లా అహోబిలంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. అహోబిలం ఆలయంలో తలనీలాల వ్యవహారంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ముడుపులు అందుతున్నాయని గంగుల బ్రిజేంద్రరెడ్డి అలియాస్ నాని ఆరోపించారు. ఇటీవల ముడుపులు అందకపోవడంతోనే తలనీలాల తరలింపును ఆమె అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.

ఈ ఆరోపణలపై భూమా అఖిలప్రియ తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని గంగుల నానికి సవాల్ విసిరారు. అహోబిలంలో బహిరంగంగా చర్చకు రావాలని, ఆరోపణలు రుజువైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో అఖిలప్రియ అహోబిలం చేరుకోగా, గంగుల నాని మాత్రం తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, వాటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో అఖిలప్రియ–గంగుల నాని వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.