చాత్రోంకి గూంజ్ – విద్యార్థి గర్జన కార్యక్రమానికి విశేష స్పందన
విజయవాడ ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “చాత్రోంకి గూంజ్ – విద్యార్థి గర్జన” కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గత వారం రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొంటూ, నీట్ పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ, విద్యా వ్యవస్థలో నెలకొన్న అవకతవకలు, నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల జాప్యం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ హామీని అమలు చేయకపోవడం, ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ క్యాలెండర్ విడుదల, ఉద్యోగాల భర్తీ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, యూపీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకుంటున్న సమస్యలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ కార్యక్రమంలో విద్యార్థులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో “చాత్రోంకి గూంజ్ – విద్యార్థి గర్జన” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఎం. నాగమధు యాదవ్, ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ నాయుడు నాయకత్వం వహించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కరీం, ఓబీసీ విభాగం నాయకులు మల్లికార్జున యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్నె మల్లికార్జున, యూత్ కాంగ్రెస్ ఎన్నికైన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సయిద్ ఖాజా మోయినుద్దీన్, నరసరావుపేట ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు నాగురువలి, తిరుపతి యువజన కాంగ్రెస్ నాయకుడు సోబరాజుతో పాటు పలువురు యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
