వీబీజీ రాంజీ ఉత్తమ ఉద్యోగులకు ఘన సన్మానం
పరకాల, ఆంధ్రప్రభ: వీబీజీ రాంజీ పథకం కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పనిదినాలు నమోదు చేసి, విధుల్లో నిబద్ధతతో సేవలందించిన ఉద్యోగులను బుధవారం ఘనంగా సన్మానించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.
పరకాల మండలం నాగారం గ్రామపంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం కోమల, పంచాయతీ కార్యదర్శి కిరణ్, టెక్నికల్ అసిస్టెంట్ సుమలత, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీకాంత్తో పాటు లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి క్రాంతికుమార్, కంప్యూటర్ ఆపరేటర్ మొగిలిని ఉత్తమ ఉద్యోగులుగా గుర్తించి సత్కరించారు.
మండల పరిషత్ ఇన్చార్జి అభివృద్ధి అధికారి రామ రామకృష్ణ, మండల పరిషత్ సూపరింటెండెంట్ రూపేష్, ఏపీవో ఇందిర చేతుల మీదుగా ఉద్యోగులకు శాలువాలు కప్పి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. విధుల్లో అంకితభావంతో పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహించడం ద్వారా ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. ఉద్యోగులు ఇదే సేవాభావంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
