సీపీఎస్ రద్దు కోసం ఆమరణ దీక్షకు సిద్ధం..
త్వరలో హైదరాబాద్లో ఉద్యమం
నిర్మల్, ఆంధ్రప్రభ: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని సీపీఎస్ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీపీఎస్ కృష్ణారావు ప్రకటించారు.
బుధవారం నిర్మల్లో ఆయన మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు నిరంతరంగా పోరాడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో అనేక ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పాత పెన్షన్ అమలుపై కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
సీపీఎస్ ఉద్యోగులు ముఖ్యమంత్రిపై ఎంతో నమ్మకం ఉంచారని, తెలంగాణలో త్వరలోనే ఓపీఎస్ అమలు అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిల్లో కొంత మొత్తాన్ని విడుదల చేయడాన్ని స్వాగతించిన ఆయన, మిగిలిన బకాయిలను ఈ నెల బిల్లుల్లోనే పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్షతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు కూడా ప్రారంభిస్తామని కృష్ణారావు తెలిపారు. ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. ప్రభుత్వ మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, కొందరు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
