sourav ganguly | ‘దాదా’ కథ వెండితెరపై..
sourav ganguly | ‘దాదా’ కథ వెండితెరపై..
సౌరవ్ గంగూలీ బయోపిక్కు గ్రీన్ సిగ్నల్
హీరోగా రాజ్‌కుమార్ రావు..
2027 మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితకథ వెండితెరపైకి రానుంది. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గంగూలీ బయోపిక్కు అధికారికంగా రూపురేఖలు సిద్ధమయ్యాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు గంగూలీ పాత్రలో నటించనుండగా, ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోట్వానే దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ అనే పేరును ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గంగూలీ కెరీర్‌లోని కీలక ఘట్టాలు, భారత జట్టుకు ఆయన అందించిన నాయకత్వం, యువ ఆటగాళ్లకు ఇచ్చిన ప్రోత్సాహం, కెప్టెన్‌గా సాధించిన విజయాలు, అనంతరం భారత క్రికెట్ పరిపాలనలో ఆయన పోషించిన పాత్రను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు.
ప్రస్తుతం చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. గంగూలీ వ్యక్తిత్వాన్ని, ఆయన ఆటతీరును ప్రతిబింబించేలా రాజ్‌కుమార్ రావు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ, పాత్రల ఎంపిక, చిత్రీకరణ ప్రణాళికలపై చిత్రబృందం వేగంగా కసరత్తు చేస్తోంది.
చిత్రాన్ని 2027 మే 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సౌరవ్ గంగూలీ జీవితకథపై తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రికెట్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
