వైభవంగా వేంకటేశ్వరస్వామివారి వార్షికోత్సవం

మహాశాంతి హోమం, పూర్ణాహుతితో ప్రారంభ…
అష్టోత్తర కలశాభిషేకం…
వేదమంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ఉత్సవాలు
అధికారులు, అర్చకులు, భక్తుల సమక్షంలో ఘన నిర్వహణ

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని బందర్ రోడ్డుపై ఉన్న టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం వార్షికోత్సవ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, వేదోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. విశేష పూజలు, ఆరాధనలు, హోమాలు, కలశాభిషేకాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని దివ్య ఆశీస్సులు పొందారు.

ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నిర్వహించిన మహాశాంతి హోమం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తిపూర్వకంగా సాగింది. అనంతరం పూర్ణాహుతి సమర్పించగా, హోమగుండం నుంచి వెదజల్లిన ఆధ్యాత్మిక పరిమళాలు, వేదఘోషలతో ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణంతో కళకళలాడింది. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర కలశాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్ర తీర్థజలాలతో అభిషేకం అనంతరం విశేష అలంకారంలో అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. వార్షికోత్సవ కార్యక్రమాల్లో టెంపుల్ సూపరింటెండెంట్ ఎం. మల్లికార్జున, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ లలిత రమాదేవి, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందారు.