కదిరిలో ఎస్ఐఆర్ డిజిటలైజేషన్‌పై జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశం
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జరుగుతున్న ఎస్ఐఆర్ (ఎస్‌ఐఆర్) నమోదు ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కదిరికి చెందిన పోలింగ్ కేంద్రాలు 83 నుంచి 86 వరకు ఉన్న ఎస్‌ఐఆర్ నమోదు ఫారాల కంప్యూటరీకరణ పనులను పరిశీలించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో భాగమైన ఈ డిజిటలైజేషన్ అత్యంత కీలకమని, డేటా నమోదు సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో పని చేయాలని సూచించారు. ఉన్నతాధికారులు నిర్దేశించిన గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో జరుగుతున్న డిజిటలైజేషన్ పనులను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, సిబ్బందికి తగిన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీలో కదిరి మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్, తహసీల్దార్ రెడ్డి శేఖర్, స్థానిక ఎంపీడీఓతో పాటు ఎన్నికల విభాగం సూపర్‌వైజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
