నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా
నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు నేరాలను ముందస్తుగా గుర్తించి అడ్డుకునే లక్ష్యంతో శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు నైట్ విజన్ సదుపాయం కలిగిన డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన పట్టణాలు, జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాలు, సున్నిత ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, ఉత్సవాలు జరిగే ప్రదేశాలు, ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల పై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. ఈ చర్యల ద్వారా రాత్రి వేళల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి, నేరాలకు పాల్పడే వ్యక్తుల కదలికలను ముందుగానే పసిగట్టే అవకాశం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఎయిర్‌పోర్ట్ సీఐ బొజ్జప్ప తన సిబ్బందితో కలిసి పుట్టపర్తి అర్బన్, రూరల్ పరిధిలో విస్తృతంగా డ్రోన్ నిఘా నిర్వహించారు. కర్ణాటక సరిహద్దుకు సమీపంలోని నాగేపల్లి ప్రాంతం, పుట్టపర్తి పట్టణం, మామిళ్లకుంట క్రాస్, పుట్టపర్తి గ్రామీణ ప్రాంతాలు, బుక్కపట్నం టౌన్ మరియు ప్రధాన రహదారి, కొత్తచెరువు నెహ్రూ సర్కిల్‌తో పాటు పరిసర గ్రామాల్లో నైట్ విజన్ డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. డ్రోన్ సాంకేతికత వినియోగంతో రాత్రి సమయంలో కూడా స్పష్టమైన చిత్రాలను సేకరించడం సాధ్యమవుతోంది.
దీని ద్వారా చోరీలు, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద సమావేశాలు వంటి అంశాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే వీలుంటుందని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పరిస్థితులను కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఈ సాంకేతికత కల్పిస్తోంది. జిల్లాలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరస్థుల్లో భయాందోళన కల్పించడం, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. డ్రోన్ నిఘా కారణంగా నేరాలకు పాల్పడే వ్యక్తుల కదలికలు రికార్డు కావడంతో పాటు చట్టపరమైన చర్యలకు అవసరమైన ఆధారాలు కూడా సేకరించబడతాయని పేర్కొన్నారు.

పోలీస్ శాఖ చేపడుతున్న ఈ ఆధునిక పర్యవేక్షణ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఎయిర్‌పోర్ట్ సీఐ బొజ్జప్ప విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించడం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనించినట్లయితే వెంటనే డయల్-100 లేదా అత్యవసర సేవల నంబర్ 112కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని గోప్యంగా ఉంచి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ విషయంలో పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు అన్ని విధాలుగా చర్యలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ శాఖతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ సహకరిస్తే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాలో తొలిసారిగా విస్తృత స్థాయిలో నైట్ విజన్ డ్రోన్ కెమెరాల వినియోగం చేపట్టడం ద్వారా శాంతిభద్రతల నిర్వహణలో సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతోందని, భవిష్యత్తులో ఈ విధానాన్ని మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రజల భద్రతతో పాటు నేరాల నియంత్రణలో కూడా మెరుగైన ఫలితాలు సాధించగలమనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
