ఫోన్ స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: పోలీస్ కమిషనర్
వర్ని (ఆంధ్రప్రభ): ఫోన్ కాల్స్, ఓటీపీల ద్వారా జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. జాకోరా గ్రామంలో బాలవికాస్ సంస్థ సహకారంతో రూ.3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటీపీలను ఇతరులతో పంచుకోవడం వల్ల బ్యాంకు ఖాతాల్లోని నగదు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫోన్ ద్వారా జరిగే సైబర్ నేరాల్లో డబ్బు రికవరీ చేయడం చాలా క్లిష్టమని తెలిపారు.
దొంగతనాలు, ఇతర నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని గ్రామస్తులకు వివరించారు. వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాంటి కార్యకలాపాలపై ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జాకోరా సర్పంచ్ సాయిలు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, వర్ని ఎస్ఐ వంశీకృష్ణ, రుద్రూర్ ఎస్ఐ తిలక్, కలాల్ గిరి, మాజీ జెడ్పీటీసీ రంజ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
