ముఖ్యమంత్రి పర్యటనకు 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు
ఎనిమిది సెక్టార్లుగా భద్రతా ఏర్పాట్లు
విధుల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ ఆదేశం
బందోబస్తు నిర్వహణపై దిశానిర్దేశం
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9న నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించనున్న ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు.

ముఖ్యమంత్రి బందోబస్తు కోసం సుమారు 1,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని ఎనిమిది సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్కు ఉన్నతాధికారులతో పాటు తగిన సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై భద్రతా ఏర్పాట్లు, విధుల నిర్వహణ, సమన్వయంపై సమగ్ర దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రాధాన్యమైన కార్యక్రమమని, విధుల్లో పాల్గొనే ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అత్యంత అప్రమత్తత, క్రమశిక్షణ, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా తనిఖీలు, వీఐపీ మార్గ భద్రత, సభా ప్రాంగణ భద్రత, జనసంచారం నియంత్రణ అంశాల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెలిప్యాడ్, సభా వేదిక, తహసీల్దార్ కార్యాలయం, కార్యకర్తల సమావేశ వేదిక తదితర ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
అప్పగించిన ప్రాంతాలకు సమయానికి చేరుకుని ఉన్నతాధికారుల ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
