అనుమానంతో భార్య గొంతు కోసి హత్య.. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
శ్రీ సత్యసాయి బ్యూరో, (ఆంధ్రప్రభ): శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో బుధవారం తెల్లవారుజామున జరిగిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్యపై అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భర్త కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ముదిగుబ్బ మండలం ముద్దన్నగారిపల్లి గ్రామానికి చెందిన లోమడ సునీత (35)కు ఈదులపల్లి గ్రామానికి చెందిన గంగరాజుతో సుమారు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 10, 8 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో ధర్మవరంలో నేసే పని చేస్తూ జీవనం సాగించిన దంపతులు, రెండేళ్ల క్రితం ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లారు. అక్కడ గంగరాజు సిమెంట్ పనులు చేస్తుండగా, సునీత గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. వారి ఇద్దరు కుమారులు ప్రస్తుతం ముద్దన్నగారిపల్లిలో అమ్మమ్మ శ్యామలమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు.
భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయని, సునీతకు అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తూ గంగరాజు తరచూ వేధింపులకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
జూలై 7న ముద్దన్నగారిపల్లిలో జరిగిన గొడవలో సునీత గాయపడటంతో చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి మహిళల వార్డులో సునీత తన తల్లి శ్యామలమ్మ, సోదరి అనూషతో కలిసి ఉండగా, గంగరాజు అక్కడికి వచ్చి పదేపదే ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. దీంతో అతడిని బయటకు వెళ్లాలని సునీత కోరింది.
బుధవారం తెల్లవారుజామున మహిళల వార్డు నుంచి అత్యవసర విభాగం వైపు వస్తున్న సమయంలో, మధ్యలో ఎవరూ లేని ప్రదేశంలో ముందుగానే తన వద్ద దాచుకున్న చిన్న కత్తితో గంగరాజు సునీత గొంతు కోసి హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. భార్యపై అనుమానమే ఈ దారుణ ఘటనకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు కదిరి పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.వి. నారాయణరెడ్డి తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
