చిరుధాన్యాల సాగుపై రైతులకు అవగాహన
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాల పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారతీయ చిరుధాన్యాల పరిశోధనాస్థానం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (ములుగు) సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్వాయి, భూపతిపురం, చిట్యాల గ్రామాల రైతులు పాల్గొన్నారు.
భారతీయ చిరుధాన్యాల పరిశోధనాస్థానం శాస్త్రవేత్త ఎ. శ్రీనివాస్ చిరుధాన్యాల సాగు పద్ధతులు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై రైతులకు వివరించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విశ్వతేజ సాగులో పాటించాల్సిన మెలకువలను తెలియజేశారు. అనంతరం రైతులకు ఉచితంగా జొన్న విత్తనాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహేష్, వ్యవసాయ విస్తరణ అధికారి కళ్యాణి, వ్యవసాయ విద్యార్థులు రోషన్, ఆల్డ్రిన్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
