Special Story | ఉపాధ్యాయులు ఫుల్.. విద్యార్థులు నిల్..!

  • ఒకే విద్యార్థి.. ఇద్దరు ఉపాధ్యాయులు..
  • ఒకరు సెలవులోనే..
  • ముగ్గురు విద్యార్థులు ఉన్నచోట.. ముగ్గురు ఉపాధ్యాయులు..
  • ప్రభుత్వ పాఠశాలలపై కొరవడుతున్న పర్యవేక్షణ
  • మూత”బడి” పోనున్న ప్రభుత్వ పాఠశాలలు.. ప్రైవేటు వైపు మొగ్గు
  • రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు సర్కారు కొలువు ప్రశ్నార్థకమే


నర్సింహులపేట, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ) : విద్యార్థుల సంఖ్యను పెంచి.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు శాతాన్ని మాత్రం పెంచలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు మూత”బడే”పరిస్థితి నెలకొంది. జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభించి బడిబాట కార్యక్రమం నిర్వహించినా.. అరకొర విద్యార్థులే చేరారు. ఇప్పుడా ఆ విద్యార్థుల శాతం కూడా తగ్గిపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్నాయి. విద్యార్థులతో నిండాల్సిన ప్రభుత్వ బడులు ఉపాధ్యాయులతో నిండుతున్నాయి.. పట్టుమని పదిమంది విద్యార్థులు లేని బడుల్లో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఈ విధంగా విద్యా వ్యవస్థ కొనసాగితే ప్రభుత్వ బడులను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని పలు విద్యార్థి సంఘాలు, పలు ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రభుత్వం సౌకర్యాలు అందిస్తున్నా.. హాజరు శాతం పెరగడం లేదు..
ప్రభుత్వం అందించే ఉచిత దుస్తులు.. మధ్యాహ్న భోజనం అన్నిరకాల సౌకర్యాలు కల్పించినా.. విద్యార్థుల శాతం పెంచకపోవడంతో రాబోయే రోజుల్లో సర్కార్ కొలువు కోసం ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నర్సింహులపేట మండలంలోని పాఠశాలలు..
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో 34ప్రాథమిక పాఠశాలలు, 10ప్రాథమికోన్నత పాఠశాలలు, 2 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.. వీటిలో ఆంధ్రప్రభ పరిశీలన చేయగా..

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ..
అమీర్యతండాలో ఒకే విద్యార్థి ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. ఇదే పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయుడు ఉంటే అందులో హెచ్ఎం లీవ్ లోనే ఉన్నారు. వస్త్రం తండాలో ముగ్గురు విద్యార్థులకు.. ఇద్దరు ఉపాధ్యాయులు. ఇదిలా ఉండగా ఒకరు సెలవులో ఉన్నారు. లోక్యతండాలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఇలా సగం పాఠశాలల్లో నలుగురు, ముగ్గురు ఉపాధ్యాయులు.. నలుగురు, ముగ్గురు విద్యార్థులతో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు..

సుమారు 30మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సుమారు 30మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల హాజరు శాతం లేకపోవడంతో ముగ్గురు ఉపాధ్యాయులకు ముగ్గురు విద్యార్థులు ఉంటున్నారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, పలు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *