విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకోండి
జబర్దస్త్ ఫేమ్ రాజమౌళి సూచన
కేసముద్రం, ఆంధ్రప్రభ: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్దిని హైస్కూల్లో మంగళవారం జబర్దస్త్ ఫేమ్ రాజమౌళి విద్యార్థుల అవగాహన సదస్సులో ఉద్దేశించి ప్రేరణాత్మక ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమయం ఎంతో విలువైనదని, విద్యార్థులు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యాభ్యాసంలో ముందుకు సాగాలని సూచించారు.
విద్యార్థి దశలోనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు క్రమశిక్షణతో, పట్టుదలతో చదవాలని చెప్పారు. లక్ష్య సాధనకు కష్టపడే వారికి విజయం తప్పకుండా లభిస్తుందని పేర్కొన్నారు. విద్యతో పాటు మంచి నడవడి, సమయపాలన అలవర్చు కోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థుల్లో ఉత్సాహం నింపేందుకు పలు కామెడీ సన్నివేశాలను ప్రదర్శించి, పాటలు పాడుతూ వారిని అలరించారు. ఆయన మాటలు, వినోదాత్మక కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.
అనంతరం పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ పేదరికంలో పుట్టి ఎటువంటి వసతులు, సపోర్టు లేకుండానే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ పరిచయమయ్యేలా ఎదిగిన జబర్దస్త్ రాజమౌళిని ప్రతి విద్యార్థి ఆదర్శంగా చేసుకోవాలని సూచించారు. అనంతరం జబర్దస్త్ రాజమౌళిని కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బండ వెంకన్న, చంద శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
