ముంపు ముప్పు నివారణకు ప్రత్యేక కార్యాచరణ
- వాటర్ ట్యాంక్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం
- అన్ని చర్యలు చేపడుతున్నామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వెల్లడి
కరిమాబాద్, ఆంధ్రప్రభ: గ్రేటర్ వరంగల్లోని శివనగర్ ప్రాంతాన్ని ముంపు సమస్య నుంచి కాపాడేందుకు మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు తెలిపారు. మంగళవారం ముంపుకు గురయ్యే 35వ డివిజన్ పరిధిలోని శివనగర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ముఖ్యంగా మైసయ్యనగర్, ఏసీ రెడ్డినగర్ ప్రాంతాల్లో స్లమ్ వాటర్ డ్రైనేజ్ పనులను పరిశీలించి అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ.. స్థానికంగా అండర్ డ్రైనేజీ నిర్మాణంతో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి త్వరలోనే వాటి పునర్నిర్మాణం చేపడతామని తెలిపారు. ఖిలా వరంగల్ అగర్తల చెరువు నుంచి వచ్చే వర్షపు నీరు, చింతల ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు శివనగర్ స్మశానవాటిక సమీపంలోని జంక్షన్ వద్ద కలిసేలా స్లమ్ వాటర్ డ్రైనేజ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ముంపు ప్రాంతాల సమస్యల పరిష్కారానికి మంత్రి కొండా సురేఖ ప్రత్యేక కార్యాచరణను అమలు చేసేందుకు అధికారులను సమాయత్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే శివనగర్ వాటర్ ట్యాంక్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు సీసీ రోడ్డు నిర్మించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నవీన్ రాజు, గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్, మాజీ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, టీపీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్, 35వ డివిజన్ అధ్యక్షుడు రేణిగుంట శివకుమార్, పగడాల సతీష్, శ్రీరాం రాజేష్, భోగి సురేష్, డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
