జిల్లాలో 59.47 శాతం ఫారాల డిజిటైజేష‌న్‌..

ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో సాఫీగా స‌ర్ ప్ర‌క్రియ‌
ఓట‌ర్ల స‌హాయార్థం కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న హెల్ప్ డెస్కులు
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్‌టీఆర్ జిల్లాలో ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం సాఫీగా కొన‌సాగుతోంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు 59.47 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని చిట్టిన‌గ‌ర్‌లో ప‌ర్య‌టించారు. నియోజ‌కవ‌ర్గంలో ఏర్పాటు చేసిన ఓట‌రు హెల్ప్ డెస్కుల కార్య‌క‌లాపాల‌ను ప‌రిశీలించారు. 2002 ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్‌, ఎన్యూమ‌రేష‌న్ ఫారాల పంపిణీ, స్వీక‌ర‌ణ‌, ఫారాల డిజిటైజేష‌న్ ప‌నుల‌ను ప‌రిశీలించి.. ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్ల‌కు తావులేకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై బీఎల్‌వోలు అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఓట‌ర్ల విజ్ఞ‌ప్తి మేర‌కు ఎన్యూమ‌రేష‌న్ ఫారాలు నింపడం, సందేహాలను నివృత్తి చేయడం వంటి సేవలను హెల్ప్ డెస్కుల ద్వారా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 10,18,936 (59.47 శాతం) ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేష‌న్ పూర్త‌యింద‌న్నారు. తిరువూరులో 1,55,658 (74.58 శాతం) డిజిటైజేషన్ జరగ్గా.. విజ‌య‌వాడ ప‌శ్చిమలో 1,24,879 (48.59 శాతం), విజ‌య‌వాడ సెంట్ర‌ల్ 1,39,541 (50.23 శాతం), విజ‌య‌వాడ తూర్పు 1,40,266 (52 శాతం), మైల‌వ‌రం 1,94,322 (68.14 శాతం), నందిగామ 1,36,419 (65.75 శాతం), జ‌గ్గ‌య్య‌పేటలో 1,27,851 (61.6 శాతం) మేర ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు వివ‌రించారు.

బీఎల్‌వోలు, అధికారులు ఈసీఐ నియ‌మ‌నిబంధ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా క్షేత్ర‌స్థాయిలో విధులు నిర్వర్తించేలా ఎలాంటి ప్ర‌భావాల‌కు తావులేకుండా నిష్ప‌క్ష‌పాతంగా నిబ‌ద్ధ‌త‌తో స‌ర్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేయ‌డంలో భాగ‌స్వాములయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చేస్తున్నారని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.