కూరగాయలు పండించడంతో అధిక ఆర్థిక లాభాలు..
జిల్లా ఉద్యానశాఖ అధికారిణి సహజ
జన్నారం, ఆంధ్రప్రభ : కూరగాయలు పండించి విక్రయించినట్లయితే అధిక లాభాలు హర్జించవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి కె.సహజ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగు ప్రోత్సాహకంలో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం కూరగాయల విత్తనాల ప్యాకెట్లను రైతులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సహజ మాట్లాడుతూ.. కూరగాయల సాగు కోసం ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందన్నారు.
నేషనల్ సీడ్ కార్పొరేషన్, ప్రభుత్వ ఉద్యాన శాఖ ఉచితంగా మిర్చి, పాలకూర, టమాట, బెండకాయ,వంకాయ, తదితర విత్తనాలను సరఫరా చేసిందని, ఆ విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. అవసరం ఉన్న రైతులు పట్ట పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతులు, ఒక్క ఫోటోతో తమను సంప్రదించాలని ఆమె సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు సయ్యద్ అక్రముల్ల, కోడిమ్యాల దివ్య ,బాదావత్ అఖిల్ నాయక్, హెచ్ఈఓలు రాణి, కృషి, సఖి, రజిత, అంజలి, రైతులు పాల్గొన్నారు.
