శాస్త్రీయ, కచ్చిత సమాచారంతో నివేదిక..
డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా
బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక దృష్టి
ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక అంశాలపైనా సమీక్షించిన కమిషన్
( ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ )
బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, వాటి ప్రభావం, ప్రజాప్రాతినిధ్యం తదితర అంశాలపై వివిధ వర్గాలు అందించిన సమాచారంతో పాటు సమకాలీన, అనుభవాధారిత విచారణ ఆధారంగా శాస్త్రీయ, కచ్చిత సమాచారంతో నివేదిక రూపకల్పన జరుగుతుందని డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు. క్షేత్రస్థాయిలో అందిన వినతులు, సూచనలను సమగ్రంగా పరిశీలించడం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశాలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా మంగళవారం జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశతో కలిసి బీసీ సంక్షేమం, బీసీ కార్పొరేషన్, పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్ విద్య, ప్రణాళిక తదితర శాఖల అధికారులతో మాట్లాడారు. జిల్లాలో బీసీ వర్గాలు, సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఉన్నత విద్య అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తదితరాలపై సమీక్షించారు. కొండపల్లి బొమ్మల కళ, కళాకారులు జీవన స్థితిగతులు, ఆధునిక డిజైన్లు తదితరాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుతో పాటు ఇటీవల జిల్లా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చొరవను అధికారులు వివరించారు. జిల్లాలో జరిగిన ఏకీకృత కుటుంబ సర్వే (యూఎఫ్ఎస్) గురించి కూడా స్వర్ణగ్రామం, వార్డు అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బీసీ సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఇతర సంబంధిత వర్గాల వారు వారి అభిప్రాయాలు, వ్యక్తిగత సూచనలు, వినతిపత్రాలను, లిఖితపూర్వక అభిప్రాయాలను రాజీవ్ రంజన్ మిశ్రా స్వీకరించారు. ముదిరాజ్ సంఘం నుంచి సీహెచ్ మల్లయ్య.. ముదిరాజ్‌లను బీసీ-డీ గ్రూపు నుంచి బీసీ-ఏ గ్రూపులోకి మార్చాలని కోరారు. ఎన్.కృష్ణసింగ్.. బొందిలి కులాన్ని సెంట్రల్ ఓబీసీ లిస్టులో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కుమ్మరి శాలివాహన సంఘం నుంచి కోగంటి హనుమయ్య ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, ఐతవరం గ్రామ పంచాయితీని బీసీ రిజర్వేషన్ పంచాయితీగా మార్చాలని కోరారు. కూరపాటి కాటంరాజు.. భట్రాజు కులాన్ని బిసీ-డీ గ్రూపు నుంచి బీసీ-ఏ గ్రూపునకు మార్చాలని కోరారు. రజక అభ్యుదయ సంఘం అధ్యక్షులు వల్లూరు మధుసూదన్‌రావు స్థానిక సంస్థల ఎన్నికల్లో రజక కులం వారికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, బీసీ సంక్షేమం, సాధికారత అధికారి ఇ.జగ్గయ్య, డీఈవో ఎల్.చంద్రకళ, డీఐవో ప్రభాకర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

