అన్నా–అక్క మెంటర్‌షిప్‌కు 74 మంది ఎంపిక

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నా–అక్క మెంటర్‌షిప్ (ఏఐ & డిజిటల్ లెర్నింగ్ – ఏఐడీఐఎల్) కార్యక్రమానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ బెల్లంపల్లికి చెందిన 74 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

మైనింగ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈఐఈ) విభాగాలకు చెందిన విద్యార్థులు తెలంగాణ కోడ్ మిత్ర పోర్టల్‌లో నిర్వహించిన 14 గంటల ఏఐ, డిజిటల్ లెర్నింగ్ సర్టిఫికెట్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి స్టూడెంట్ ఇంటర్న్స్‌గా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఆయనతో పాటు అధ్యాపకులు అభినందించారు.

విద్యార్థులను భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సిద్ధం చేయడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ), ప్రోగ్రామింగ్, కోడింగ్, డిజిటల్ నైపుణ్యాలపై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.

పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు “అన్నా–అక్కలు”గా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మార్గదర్శకులుగా సేవలందించనున్నారు. మంచిర్యాల, కొమురం భీం–ఆసిఫాబాద్ జిల్లాల నుంచి మొత్తం 290 మంది విద్యార్థులు ఎంపిక కాగా, వారిలో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు చెందిన 74 మంది ఉన్నట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు.

ఎంపికైన విద్యార్థులు జూలై నుంచి సెప్టెంబర్ 2026 వరకు రెండు జిల్లాల్లోని సుమారు 30 ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ అంశాలపై మొత్తం 30 గంటలపాటు బోధన అందించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి కమ్యూనిటీ సర్వీస్ అకాడమిక్ క్రెడిట్లు కూడా లభించనున్నాయి.

ఈ సందర్భంగా కళాశాలలో ఎంపికైన 74 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి, వారిని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు పంపించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఐఈ విభాగాధిపతి బి. వెంకటేశ్వర్లు, కార్యక్రమ నోడల్ అధికారులు ఎ. సురేష్ కుమార్ (లెక్చరర్, ఈసీఈ), బి. శ్రీనివాస్ (లెక్చరర్, మైనింగ్ ఇంజినీరింగ్) పాల్గొన్నారు.