సర్కారు బడులకు నై.. ప్రైవేటు స్కూళ్లకే జై!
కుంటాల మండలంలో విద్యార్థుల కొరతతో వెలవెలబోతున్న ప్రభుత్వ హైస్కూళ్లు.. మౌలిక వసతుల లోపం, ప్రైవేటు విద్యపై మోజు ప్రధాన కారణాలుగా విశ్లేషణ
కుంటాల, ఆంధ్రప్రభ : ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో కళకళలాడిన కుంటాల మండలంలోని ప్రభుత్వ హైస్కూళ్లు నేడు విద్యార్థుల కొరతతో వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు వేలాది మంది విద్యార్థుల సందడితో సందడి చేసిన ఈ విద్యాసంస్థలు ప్రస్తుతం పదుల సంఖ్యలో విద్యార్థులతోనే కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో కొన్ని పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మండలంలోని కుంటాల, లింబకే, ఓలా, కల్లూరు ప్రభుత్వ హైస్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయితే కల్లూరు కేజీబీవీ, కుంటాల తెలంగాణ మోడల్ స్కూల్లో మాత్రం విద్యార్థుల సంఖ్య ఆశాజనకంగా ఉంది.
పదుల సంఖ్యకే పరిమితమైన విద్యార్థులు
ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో నిండిపోయిన హైస్కూళ్లలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పదులకే పరిమితమైంది. రికార్డుల్లో నమోదైన సంఖ్యకు కూడా వాస్తవ హాజరు సగం మాత్రమే ఉంటోందని తెలుస్తోంది.
లింబకే హైస్కూల్లో 124 మంది విద్యార్థులకు 9 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కుంటాల హైస్కూల్లో 100 మంది విద్యార్థులకు 11 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఉర్దూ మీడియంలో 74 మంది విద్యార్థులకు 7 మంది, తెలుగు మీడియంలో 36 మంది విద్యార్థులకు 7 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కల్లూరు హైస్కూల్లో 50 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇవన్నీ రికార్డుల్లో నమోదైన సంఖ్యలేనని, వాస్తవ హాజరు మరింత తక్కువగా ఉంటోందని సమాచారం.
ఇక కల్లూరు కేజీబీవీలో 200 మంది విద్యార్థులకు 9 మంది ఉపాధ్యాయులు, కుంటాల తెలంగాణ మోడల్ స్కూల్లో 680 మంది విద్యార్థులకు 18 మంది ఉపాధ్యాయులు ఉండడంతో ఈ రెండు విద్యాసంస్థలు మాత్రం మెరుగైన స్థితిలో కొనసాగుతున్నాయి.
ప్రధాన కారణాలివే…
ప్రభుత్వ పాఠశాలల ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రుల్లో ప్రైవేటు పాఠశాలలపై పెరిగిన మోజు ఒక ప్రధాన కారణమైతే, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, నాణ్యమైన విద్యా వాతావరణం లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత, పర్యవేక్షణ లోపం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ, కొంతమందిలో అంకితభావం, బాధ్యతాయుతమైన పని తీరు లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో సమయపాలన సరిగా పాటించడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించడంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని పెంచేలా నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెంపొందించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.
