మావిగన్ కాదు.. మాయాగన్..

జగన్ పిచ్చి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
జంగాలపల్లిలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ.

మైలవరం, ఆంధ్రప్రభ : మావిగన్ కాదు.. మాయాగన్. జగన్ పిచ్చి చేష్టలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. మైలవరం మండలంలోని చండ్రగూడెం గ్రామపంచాయతీ శివారు జంగాలపల్లి గ్రామంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని అన్నారు. 2014లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పరిపాలన ప్రారంభించి, అమరావతి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూములను సమీకరించి వేల కోట్ల రూపాయలు వ్యయం చేశారని పేర్కొన్నారు.

2019లో అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమరావతి అభివృద్ధిని నిలిపివేసి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు గట్టి తీర్పు ఇచ్చారని, ప్రస్తుతం మళ్లీ అమరావతిపై విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. “అమరావతిపై జగన్ విష ప్రచారం చేయడం మానుకోవాలి. అమరావతి అనేది ప్రతి ఆంధ్రుడి కల. దానిని అడ్డుకునే వారిని ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారు” అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని అభివృద్ధికి భారీ నిధులు సమకూరుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, మరోవైపు పేదల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా అభివృద్ధిని కొనసాగించే ప్రభుత్వానికే ప్రజలు మద్దతు ఇవ్వాలని, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే శక్తులను ప్రజలు తిరస్కరించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), అధికారులు, రైతులు, పార్టీ నాయకులు, కూటమి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.