ఇరిగేషన్ శాఖలో భారీ పోస్టింగ్‌లు..
ఒకేసారి బదిలీలు, అదనపు బాధ్యతలు
28 మంది ఈఈల బదిలీలు.. 8 మందికి ఫుల్ అడిషనల్ చార్జ్.. కర్నూలు, నంద్యాలకు కీలక పోస్టింగ్‌లు
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర జలవనరుల (ఇరిగేషన్) శాఖలో ప్రభుత్వం భారీ స్థాయిలో పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. జూన్ 30న పలువురు సూపరింటెండింగ్ ఇంజినీర్లు (ఎస్ఈలు), ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈలు) పదవీ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తూ ఒకేరోజు పలు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎనిమిది మంది అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు (ఫుల్ అడిషనల్ చార్జ్) అప్పగించగా, కీలక సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులకు ఇన్చార్జిలను నియమించింది. మరో విడతలో 28 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల బదిలీలకు ఆమోదం తెలిపింది.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, పదవీ విరమణల కారణంగా ఏర్పడిన ఖాళీలతో పరిపాలనకు అంతరాయం కలగకుండా తాత్కాలికంగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంజినీర్-ఇన్-చీఫ్ (అడ్మిన్), విజయవాడ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఎనిమిది మందికి పూర్తి అదనపు బాధ్యతలు
విజయవాడ చీఫ్ ఇంజినీర్ (ఐఎస్ అండ్ డబ్ల్యూఆర్)గా టి. గిరిధర్ రావు, విజయనగరం టిటిపీఆర్ సర్కిల్ ఎస్ఈగా మమ్మడ్నా రావు హనుమంతులు, ఏలూరు పీపీఆర్ఎంసీ సర్కిల్‌కు కె. శ్రీనివాసరావు, దవళేశ్వరం డిజైన్స్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ సర్కిల్‌కు ఎం. రాంబాబు, నెల్లూరు సోమశిల ప్రాజెక్టు సర్కిల్‌కు జి. రామచంద్రమూర్తి, విజయవాడ డిప్యూటీ ఇంజినీర్-ఇన్-చీఫ్ (అడ్మిన్)గా ఎ. సూర్యభాస్కర శర్మ, కడప కన్స్ట్రక్షన్ సర్కిల్-3కు దేశే నాయక్, నంద్యాల ఎస్ఆర్బీసీ సర్కిల్-2కు ఎస్. లక్ష్మీనాయక్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
కర్నూలు, నంద్యాలకు కీలక బాధ్యతలు
పరిపాలనా అవసరాల దృష్ట్యా ఖాళీగా ఉన్న సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులకు కూడా ప్రభుత్వం ఇన్చార్జిలను నియమించింది. కర్నూలు ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా ఆదోని టీబీపీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి. సైలేశ్వర్ను నియమించింది. శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ మెయింటెనెన్స్ సర్కిల్ బాధ్యతలను నంద్యాల ఎస్ఆర్బీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం. వేణుగోపాల్ రెడ్డికి అప్పగించింది. అలాగే చిత్తూరు, అనంతపురం, దవళేశ్వరం, ఏలూరు, విజయవాడలోని పలు కీలక సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులకు కూడా అదనపు బాధ్యతలు కేటాయించింది.
28 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల బదిలీలు
మరో ఉత్తర్వులో రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల బదిలీలను ప్రభుత్వం ప్రకటించింది. నెల్లూరు వెంకటగిరి ఇరిగేషన్ డివిజన్‌కు కె. కోటేశ్వరరావు, కడప ఆర్డబ్ల్యూఅండ్ఎం డివిజన్‌కు టీ. జనార్ధన్ రెడ్డి, అనంతపురం హెచ్ఎన్ఎస్ఎస్ డివిజన్-8కు ఎం. రామసుబ్బయ్య, దవళేశ్వరం పోలవరం పీఐపీహెచ్డబ్ల్యూ డివిజన్-2కు లంక వెంకటేశ్వరరావు, చీరాల డ్రైనేజ్ డివిజన్‌కు పి. ప్రేమ్‌కుమార్, శ్రీశైలం ఎన్ఎస్ఆర్ఎస్ డ్యామ్ మెయింటెనెన్స్ డివిజన్‌కు కె. రవికుమార్‌లను నియమించింది.
అదేవిధంగా నంద్యాల ఎస్ఆర్బీసీ డివిజన్-2 (బనగానపల్లె) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుతో పాటు తిరుపతి టీజీపీ అండ్ జీఎన్ఎస్ఎస్ సర్కిల్లోని మరో పోస్టుకు స్థానికంగా తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని ఇంజినీర్-ఇన్-చీఫ్ (అడ్మిన్)ను ప్రభుత్వం ఆదేశించింది.
పరిపాలనలో అంతరాయం లేకుండా చర్యలు
పదవీ విరమణలతో ఏర్పడిన ఖాళీల కారణంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణ పనులు, పరిపాలనా వ్యవహారాలు ప్రభావితం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఎస్ఆర్బీసీ, శ్రీశైలం ప్రాజెక్టు, కర్నూలు ఇరిగేషన్ సర్కిల్ వంటి కీలక విభాగాల్లో బాధ్యతలను వెంటనే భర్తీ చేయడం ద్వారా ప్రాజెక్టుల పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు మార్గం సుగమమైందని అధికారులు తెలిపారు.
