డిజిటల్ గవర్నెన్స్ వైపు రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు..

  • కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికీ 1నే జీతాలు..
  • లోపభూయిష్ట ఏజెన్సీలపై కొరడా!

ఆంధ్ర‌ప్ర‌భ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో పారదర్శకతను పెంచడంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త డిజిటల్ వ్యూహాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ (Digital Governance) దిశగా సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసి, అవసరమైన మేరకు నూతన చట్టాలను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ (MCR HRD) లోని బోధి పెవిలియన్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

ఒకటో తారీఖునే జీతాలు..

ప్రభుత్వ ఉద్యోగులతో పాటే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా ప్రతి నెలా 1వ తేదీ నుంచి 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాలు అందేలా వ్యవస్థను మార్చాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పూర్తి వివరాలు, వారి వేతనాలు, బ్యాంక్ అకౌంట్ డేటాను 100 శాతం డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా.. అందులో దాదాపు 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ (ESI), పీఎఫ్ (PF) చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదలవుతున్నప్పటికీ, ఏజెన్సీలు ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నట్లు తేలింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్రమాలకు పాల్పడుతున్న మరియు నిర్లక్ష్యం వహిస్తున్న సదరు ఏజెన్సీలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా ఇలాంటి దోపిడీ వ్యవస్థకు శాశ్వతంగా చెక్ పెట్టాలని సూచించారు.

100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని హైలెవెల్ కమిటీకి ఆదేశం

ఈ సరికొత్త డిజిటల్ విధానంపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసేందుకు వీలుగా ఒక ఉన్నత స్థాయి కమిటీని (High-level Committee) నియమించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ కమిటీ రాబోయే 100 రోజుల్లో సమగ్ర నివేదికను సమర్పించి, ఈ సంస్కరణలను ఒక కొలిక్కి తీసుకురావాలని డెడ్‌లైన్ విధించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ వేగంగా అమలు చేసేందుకు వారి వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలని సీఎం చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు (Monitoring) ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు, మున్సిపల్ శాఖ (MA&UD) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వైస్ చైర్మన్ శాంతికుమారితో పాటు పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.