నోటి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు

ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ జి. దేవి మానస

విజయవాడ, ఆంధ్రప్రభ : నోటి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా మందిలో పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుందని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ జి. దేవి మానస తెలిపారు. భారతదేశంలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో నోటి క్యాన్సర్ ఒకటని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఆరోగ్య సదస్సులో “నోటి క్యాన్సర్” అంశంపై ఆమె ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పెదవులు, నాలుక, చిగుళ్లు, చెంపల లోపలి భాగం, నోటి పైభాగం లేదా నోటి అడుగు భాగంలో ఏర్పడే క్యాన్సర్‌ను నోటి క్యాన్సర్‌గా పేర్కొంటారని చెప్పారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సిగరెట్, బీడీ, గుట్కా, జర్దా, ఖైనీ, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారిలో నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని, మద్యపానం కూడా ఆ ప్రమాదాన్ని మరింత పెంచుతుందని తెలిపారు. నోటి పరిశుభ్రత లోపించడం, పదునైన లేదా పాడైన పళ్ల వల్ల తరచూ గాయాలు కావడం, సరిగా అమరని కట్టుడు పళ్లు, పోషకాహార లోపం, కొన్ని వైరస్‌ల ఇన్‌ఫెక్షన్లు కూడా ఈ వ్యాధికి కారణమవుతాయని వివరించారు.

నోటిలో రెండు వారాలకు మించి మానని పుండు, తెలుపు లేదా ఎరుపు రంగు మచ్చలు, నాలుక లేదా చెంపలో గడ్డ, నమలడం లేదా మింగడంలో ఇబ్బంది, నోరు పూర్తిగా తెరవలేకపోవడం, మెడలో గడ్డ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ప్రారంభ దశలో చాలామందికి నొప్పి ఉండదని, అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నోటి క్యాన్సర్‌ను నిర్ధారించేందుకు అవసరమైతే బయాప్సీ, స్కానింగ్ వంటి పరీక్షలు నిర్వహించి వ్యాధి దశను బట్టి శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీతో పాటు అవసరమైతే ఆధునిక లక్ష్యిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రారంభ దశలో చికిత్స ప్రారంభిస్తే పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. నివారణలో భాగంగా పొగాకును ఏ రూపంలోనూ వినియోగించకూడదని, మద్యపానాన్ని పూర్తిగా మానేయడం లేదా తగ్గించడం మంచిదన్నారు.

రోజుకు రెండుసార్లు పళ్లు శుభ్రం చేసుకోవడం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్ష చేయించుకోవడం, తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి నెలా ఒకసారి అద్దం ముందు నిలబడి నోటిని స్వయంగా పరిశీలించుకోవాలని, ఏవైనా అసాధారణ మార్పులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని ఆమె కోరారు. సదస్సులో పాల్గొన్న పలువురు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ జి. దేవి మానస సమగ్రంగా సమాధానాలు ఇచ్చి సందేహాలను నివృత్తి చేశారు.