ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియ విజయవంతానికి అఖిలపక్షాల సహకారం అవసరం

ఓటరు జాబితా ప్రత్యేక సవరణను పారదర్శకంగా పూర్తి చేస్తాం: మండల ప్రత్యేక అధికారి శంకర్ నాయక్

ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) నమోదు ప్రక్రియను నిర్ణీత గడువులోగా విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పూర్తి సహకారం అందించాలని ఊట్కూర్ మండల ప్రత్యేక అధికారి శంకర్ నాయక్ కోరారు.

మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియపై అఖిలపక్ష నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను పూర్తి చేయనున్నందున సంబంధిత బూత్ స్థాయి ఏజెంట్లు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పూర్తి సహకారం అందించాలని కోరారు.

అర్హులైన ప్రతి ఓటరు వివరాలు జాబితాలో నమోదు అయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎలాంటి అపోహలకు తావివ్వకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారు ఫారం-6, ఓటరు వివరాల్లో మార్పులు, చేర్పులు, సవరణల కోసం ఫారం-8ను పూర్తి చేసి సంబంధిత బీఎల్‌ఓలకు సమర్పించాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చింత రవి, మల్లేపల్లి సర్పంచ్ కథలప్ప, మాజీ సర్పంచ్ భాస్కర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సూర్యప్రకాశ్ రెడ్డి, యజ్ఞేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రణవీర్, తారాకృష్ణ, హన్మంతు, శివరాజ్ రెడ్డి, సలీం, చెన్నప్ప, గౌతమ్, వెంకటేష్ గౌడ్, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.