Heavy Rains | మహారాష్ట్రలో భారీ వర్షాల బీభత్సం.. 16 మంది మృతి
Heavy Rains | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముంబైతో పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ముంబైలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
ముంబై–పుణె ప్రాంతాల్లో భారీ వర్షాలతో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కొండచరియలు విరిగిపడటంతో పలు చోట్ల రైల్వే పట్టాలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
